మనలో చాలామందిమి మన చర్యలన్నిటికీ మనమే కారణం అని మన విధిని మనమే నిర్ణయిస్తామని నమ్ముతాము. భగవద్గీతలో కృష్ణభగవానుడు గుణాల మధ్య ప్రతిస్పందనలే కర్మను సృష్టిస్తాయని అంతేగానీ కర్త వల్ల కాదని బోధిస్తున్నారు. ప్రకృతి నుంచి మూడు గుణాలు పుట్టి ఆత్మను భౌతిక దేహంతో బంధిస్తాయి. ఈ సత్వ, రజో, తమో గుణాలు మనలోని ప్రతి ఒక్కరిలో వివిధ పాళ్లలో ఉంటాయి. సత్వగుణం జ్ఞానంతో, రజోగుణం కర్మలతో, తమోగుణం అలసత్వంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి.
కేవలం 'ఎలక్ట్రాన్లు', 'ప్రోటాన్లు', 'న్యూట్రాన్ల' ల కలయిక వలన విస్తృతమైన లక్షణాలు గల అనేక వస్తువులు ఉత్పన్నమైనట్లే ఈ మూడు గుణాలు యొక్క కలయికే మన స్వభావానికి, కర్మలకు కారణం. నిజానికి, వ్యక్తుల మధ్య జరిగే సంప్రదింపులు వారి యొక్క గుణాలు మధ్య జరిగే సంప్రదింపులే తప్ప మరేమీ కాదు.
విద్యుదయస్కాంత క్షేత్రంలో ఉంచిన అయస్కాంత ద్విధృవం (dipole) ఆ క్షేత్రం వెంటే తిరుగుతుంది. వస్తువులు గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆకర్షింపబడతాయి. ఇటువంటి అనేక భౌతిక రసాయనిక లక్షణాలు ఉన్నాయి. అలాగే కర్మ కూడా కర్త వల్ల కాక గుణాల యొక్క కలయిక వల్ల జరుగుతుంది. భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ అంతర్నిర్మిత స్వయంచాలకత గురించి శ్రీకృష్ణుడు మనకు అవగాహన కలిగిస్తున్నారు.
ఉదాహరణకి మన స్వంత దేహం కూడా తనంతట తానే (స్వయంచాలకంగా) పని చేస్తుంది. గుణకర్మల మధ్య ఉన్న సంబంధాన్ని వివరించడానికి ఈ ఉదాహరణలు సహాయం చేస్తాయి. మన జీవిత అనుభవాల సహాయంతో ఈ సత్యాన్ని గుర్తిస్తే మనలో మార్పు సాధించ గలుగుతాము.
ఆత్మజ్ఞానం పొందే దారిలో ప్రధానమైన అవరోధం అహంకారం. మన పెంపకంలోని నియంత్రణ మనమే కర్తలమని భావించుకునేలా చేసి అహంకారానికి పునాదులు వేస్తుంది. కాని వాస్తవానికి ఈ మూడు గుణాలు మధ్య పరస్పర కలయికలే కర్మను సృష్టిస్తాయి.
ఈ సత్యాన్ని అవగాహన చేసుకుని, మనల్ని మనం మెరుగు పరచుకోవడమనే బాధ్యత మన భుజాల పైనే ఉంటుందని, ఇది జరిగేలా ఇంకెవరూ చేయలేరనీ శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు.