శ్రీకృష్ణుడు అర్జునుడితో (2.25) “ఇది” (దేహి/ఆత్మ) అవ్యక్తమైనది, అనూహ్యమైనది, వికారరహితమైనదని చెప్పి, ఒకసారి మీరు దీని గురించి తెలుసుకుంటే, భౌతిక శరీరం కోసం దుఃఖించ వలసిన అవసరం లేదని అంటారు. ఇంకా, పుట్టుకకు ముందు అన్ని జీవులు అవ్యక్తంగా ఉంటాయని, పుట్టుకకు చావుకు మధ్య మాత్రమే వ్యక్తమవుతాయని, తిరిగి మరణించాక అవ్యక్త (అదృశ్య) మవుతాయని శ్రీకృష్ణుడు (2.28) బోధిస్తున్నారు.అనేక సంస్కృతులు దీనిని వివరించడానికి సముద్రము, అలల పోలికలు ఇస్తాయి. సముద్రం అవ్యక్తాన్ని సూచిస్తే అల వ్యక్తాన్ని సూచిస్తుంది. సముద్రం నుంచి అలలు అనేక పరిమాణాలు, ఆకారాలు, తీవ్రతలతో కొంత కాలపరిమితి కోసం మాత్రమే వ్యక్తమవుతాయి. చివరికి అలలు అవి పుట్టిన సముద్రంలోనే కలిసిపోతాయి. వ్యక్తమయ్యే అలలను మాత్రమే ఇంద్రియాలు తెలుసుకోగలవు.అలాగే ఒక విత్తనానికి చెట్టుగా ఎదిగే సామర్థ్యం ఉంటుంది. విత్తనంలో చెట్టు అవ్యక్త రూపంలో ఉంటుంది. అది మొలక రావడం మొదలవగానే వ్యక్తమవడం మొదలు పెడుతుంది. చివరికి అది అనేక విత్తనాలను ఉత్పత్తి చేసి మరణిస్తుంది.ఇంద్రియాలు తమ పరిమితమైన సామర్థ్యంతో తెలుసుకోగల వాటిని 'వ్యక్తము' అంటాము. ఆధునిక యుగంలో మన ఇంద్రియాల యొక్క సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి కొన్ని సాంకేతిక పరికరాలు కూడా వచ్చాయి. సూక్ష్మదర్శిని/దూరదర్శిని వంటివి కళ్ల యొక్క సామర్థ్యాన్ని పెంచేవి. ఎక్స్ రే పరికరం వివిధ పౌనఃపున్యాల కాంతిలో వస్తువులను చూసేందుకు కంటికి సహకరిస్తుంది.“ఇది” (ఆత్మ) అనూహ్యమైనదని శ్రీకృష్ణుడు అంటారు. అంటే సాంకేతిక పరికరాల సహాయంతో అయినా మన ఇంద్రియాలు దాన్ని తెలుసుకో లేవు. మెదడు అనేక ఇంద్రియాల సమ్మేళనమే కనుక దానికి అవ్యక్తాన్ని తెలుసుకునే సామర్థ్యం లేదు.మన అందరి లాగానే అర్జునుడు తనను తాను భౌతిక దేహంతో గుర్తించుకుంటాడు ఎందుకంటే అతనికి అంతకుమించిన అనుభవము, ఆలోచన అవగాహన లేవు.అవ్యక్తాన్ని గురించిన జ్ఞానోదయం కలిగించి తద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడి ఆలోచనల్లో ఆదర్శమైన మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాడు. అర్జునుడి వంటి మేధావికి ఇది అర్థం చేసుకోవడానికి స్వయానా భగవానుడి అవసరం వచ్చింది. ఇక మనం దీనికి అతీతులం కాదు.